నేటి నుండి రాజధాని రైతుల మహా పాదయాత్ర

రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర నేడు (సోమవారం) ప్రారంభం కానుంది. అమరావతి పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది, పది గంటల మధ్మలో ప్రారంభం కానున్న ఈ యాత్రను విజయవంతం చేయడానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజధాని నగరం అమరావతికి శంకుస్థాపన చేసిన ఉద్దండ్రాయునిపాలెం నుండి యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుండి తిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానం వరకు యాత్ర సాగనుంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా సాగే ఈ యాత్ర మార్గమధ్యలో వచ్చే వివిధ మతాలకు చెందిన క్షేత్రాలు, ప్రార్ధనా మందిరాలను రైతులు సందర్శించి తమ గోడును వెల్లబోసుకోనున్నారు. 503.3 కి.మీ దూరం సాగనున్న ఈ యాత్రను తొలుత 32 రోజుల్లో నిర్వహించాలని భావించినప్పటికీ ఆ తరువాత 44 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించారు. ఈ యాత్రకు ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి.