నవగ్రహాల అనుకూలత కోసం ఈ పూజలు చేస్తే చాలు !

నవగ్రహాలు… భక్తి మార్గంలో పయనించే పత్రీ ఒక్కరూ ప్రగాఢంగా జ్యోతిష్యం విశ్వసిస్తారు. అయితే ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఆయా గ్రహాల అనుకూలత లేకపోవడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఆ సమయంలో వారు కొన్నిరకాల శాంతులను చేసుకుంటే తప్పక వాటి ప్రభావం కొంతమేర లేదా చాలా వరకు తగ్గి కష్టాలను గట్టెకవచ్చు. వీటికి సంబంధించిన వివరాలు పండితులు పేర్కొన్నవి తెలుసుకుందాం…

సూర్యగ్రహ అనుగ్రహము కోసం ఇలా చేయండి..

రథసప్తమి నాడు ఆయా ప్రాంతీయ ఆచారాల ప్రకారం పూజలు చేయడం, సూర్య చంద్ర వ్రతము చేయాలి. వీటితోపాటు నవగ్రహదేవాలయంలో సూర్యుడికి గోధుమలను నైవేద్యంగా పెట్టి, ప్రదక్షణలు చేయడం వల్ల, ఆదివారంనాడు సూర్యారాధన, జిల్లేడుతో పూజలు మంచి ఫలితాలనిస్తుంది.

చంద్రగ్రహ అనుగ్రహమునకు చేయాల్సిన పనులు…

అమావాస్య సోమతి వ్రతం, కృష్ణాష్టమి వ్రతం, సోమవార వ్రతం, శివుడికి సోమవారం పూజ చేయడం. ప్రతీ పౌర్ణమికి, శుక్రవారం తెల్లని పూలతో అమ్మవారి పూజ చేయడం మంచిది. అదేవిధంగా తెల్లని పూలుతో చంద్రగ్రహప్రదక్షణలు చేయాలి.

కుజుని అనుగ్రహానికి ఇలా చేయండి…

నాగుల చవితి, నాగ పంచమి, అంగారక చవితి, కాత్యాయనీ వ్రతము, కుజగౌరీ వ్రతము, ఎర్రని పూలతో కుజగ్రహానికి పూజలు, కందుల నైవేద్యం సమర్పించి అంగారక అనుగ్రహం పొందండి.

బుధుడు అనుగ్రహానికి ఇలా చేయండి…

శ్రీ అనంత పద్మనాభ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, తులసీ వ్రతము, పెసర్లను నైవేద్యంగా సమర్పించి బుధగ్రహ ప్రదక్షణలు చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

గురు అనుగ్రహానికి ఇలా చేయండి…

దక్షిణామూర్తి స్తోత్రంపారాయణం, హయగ్రీవ స్తోత్రపారాయణం, గురుస్తోత్రం పారాయణం, పసుపు పూలతో గురు గ్రహ ప్రదక్షణలు చేయాలి. సాయిబాబా దేవాలయ ధునిలో కొబ్బరికాయ సమర్పించి ప్రదక్షణలు చేయడం, శ్రీ సత్యసాయి వ్రతము, శ్రీ సత్యదత్త వ్రతము, త్రినాథ వ్రతాలను చేయాల్సి ఉంటుంది.

శుక్రుడు అనుగ్రహానికి ఇలా చేయండి …

దుర్గాదేవి ఆరాధన, తెల్లనిపూలతో ఆరాధన, బియ్యంతో చేసిన పాయసం నైవేద్యం పెట్టడం చేయాలి. వీటితోపాటు కింది వాటిలో ఏది వీలైతే దాన్ని చేయాలి… వరలక్ష్మీ వ్రతం, వైభవలక్ష్మీ వ్రతం, శ్రీలక్ష్మి కుబేర వ్రతం, సంతోషిమాత, అనఘాదేవి వ్రతాలను చేయాలి.

శని అనుగ్రహానికి ఇలా చేయండి..

శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన, హనుమాన్‌ ఆరాధన, చాలీసా పారాయణం, శివాభిషేకం, రుద్రపారాయణం, హనుమద్వ్రతము, శివరాత్రి, శనైశ్చర వ్రతము, దశరథ శనిస్తోత్ర పారాయణం, శనికి తైలాభిషేకం, ఉప్పు, నువ్వులు, నల్లని పూలు, నల్లని వస్త్రం, నువ్వుల నూనె, నిమ్మకాయతో అభిషేకం చేయాలి. వీటితోపాటు ప్రతీ శనివారం శనికి ప్రదక్షణలు చేయాలి.

రాహుగ్రహా అనుగ్రహమునకు ఈ విధంగా చేయండి…

శ్రీ దుర్గాదేవి ఆరాధన, స్తోత్రం పారాయణం, లలితాదేవి ఆరాధన, శ్రీదేవి నవరాత్రులలో పూజలు, సావిత్రీ షోడశగౌరీ వ్రతం, చండీదీపారాధనతోపాటు శ్రీకాళహస్తీలో రాహుకేతు పూజలు చేయాలి.

కేతువు అనుగ్రహానికి ఇదేవిధంగా చేయాలి…

చిత్రగుప్త పూజ, రంగురంగు పూలతో ప్రదక్షణలు, వినాయక పూజ, సంకష్టహర చతుర్థి, అమ్మవారి పూజ మంచి ఫలితాలు వస్తాయి.ఇవేకాకుండా ఆయా ప్రాంతాలలో ఉన్న నవగ్రహదేవాలయాల సందర్శన, శివాలయాలు, విష్ణు ఆలయాలు, హనుమాన్‌, అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయాలి. వీటితోపాటు శ్రీఘ్రంగా అనుకూల ఫలితాల కోసం పేదలకు సహాయం, దానధర్మాలు, ధర్మం తప్పకుండా జీవనం సాగిస్తే అతి త్వరగా నవగ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు.