ఇల్లు కొంటున్నారా.. అయితే, ఇలాంటి ఇంటిని అస్సలు కొనొద్దు..

ప్రస్తుతం స్థిరాస్తుల ధరలు మునుపెన్నడూ లేనంత తక్కువగా ఉండడంతో, చాలామంది ఇందులో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. ఆస్తి కొంటున్నప్పుడు కొనేవారికీ, అమ్మేవారికీ ఇష్టమైన ఒప్పందం కుదరటం అన్నిటి కన్నా ముఖ్యం. అదే సమయంలో వాస్తు నిపుణులు ఏమంటున్నారో కూడా తెలుసుకోండి. వంటగది ఎటువైపుంది, బాత్రూములు ఎటువైపు కట్టారు. ధారాళంగా గాలి వెలుతుర వస్తున్నాయా లాంటి విషయాలతో పాటూ.. ఇంకా కొన్ని విషయాలని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీ జీవితంలో తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం కోసం కొన్ని సూచనలు.

కొత్త ఇల్లు కొనుక్కోడం ఎప్పుడూ మంచిదే. ఎందుకంటే దానికి ఎలాంటి చరిత్ర ఉండదు. ఒకవేళ మీరు ఎవరో అమ్ముతూ ఉన్న ఇంటిని కొనాలనుకుంటే, అమ్మేవారు ఎందుకు అమ్ముతున్నారో కనుక్కోండి. ఇంకో పెద్ద ఇంట్లోకి వెళ్తున్న వారి దగ్గర నుంచో, జీవితం లో విజయశిఖరాలధిరోహిస్తున్న వారి దగ్గరనించో కొనండి.

ఇంట్లోని వారు విడాకుల వల్ల గానీ, వ్యాపారంలో నష్టపోయి గానీ, తీవ్రమైన అనారోగ్యంతో గానీ ఇల్లు అమ్ముతుంటే అది కొనడం అంత మంచిది కాదు. అలాంటి ఇల్లు కొంటున్నారంటే ఆ సమస్యలు కూడా కొంటున్నారని అనుకోవచ్చు. ఆ ఇల్లు అలాంటి ప్రతికూల పరిస్థితులని కూడా తీసుకుని ఉంటుంది కాబట్టి, వీలున్నంత వరకూ అలాంటి ఇల్లు కొనకండి.

సరైన ఆకారం లేని స్థలం గానీ, ఇల్లు గానీ మంచివి కావు. అవి వాటి సొంతదారుల జీవితాలను కూడా సరిగ్గా ఉంచవు. చదరపు ఆకారంగా గానీ, దీర్ఘ చతురస్రాకారంలో గానీ ఉన్న స్థిరాస్తి ఎప్పుడూ మంచి చేస్తుంది.