భారత్‌లో కరోనా ఉగ్రరూపం..

భారత్‌లో కరోనా ఉగ్రరూపం… కొత్తగా 9983 కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,983 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 206 మంది కరోనా బారిన పడి మృతిచెందారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,56,611కి చేరగా, మృతుల సంఖ్య 7,135కి చేరుకుంది. 1,25,381 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,24,095 మంది కోలుకున్నారు.

రికవరీ రేటు స్థిరంగా కొనసాగుతూ ఉండడం ఊరటనిస్తోంది. కోవిడ్‌ రోగుల రికవరీ రేటు 48.37 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. గడచిన 24 గంటలలో నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 1,08, 048. దేశంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 47,74, 434గా ఉంది.