పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట

టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇవాళ పతకాల పంట పండింది. సోమవారం ఒకేరోజు నాలుగు పతకాలు సాధించింది. ఇప్పటికే షూటింగ్‌లో బంగారు పతకం సాధించిన భారత్‌.. మరో మూడు మెడల్స్‌ను తన ఖాతాలో వేసుకున్నది. డిస్కస్‌ త్రోలో రజతం, జావెలిన్‌ త్రోలో రజతం, కాంస్య పతకాలు లభించాయి. డిస్కస్‌ త్రో ఎఫ్‌ 56 విభాగంలో యోగేశ్‌ కుతునియా రజత పతకం గెలుపొందాడు. ఇక జావెలిన్‌ త్రోలో దేవేంద్ర ఝజారియాకు రజతం లభించగా, సుందర్‌ సింగ్‌కు కాంస్యం గెలుపొందాడు.

మహిళల షూటింగ్‌ 10 మీటర్ల విభాగంలో షూటర్‌ అవని లేఖారా స్వర్ణం పతకం సాధించింది. దీంతో షూటింగ్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన తొలి మహిళగా అవని రికార్డుల్లో నిలిచింది. కాగా, టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఆరుకు చేరింది. ఇందులో ఓ స్వర్ణం, మూడు రజతాలు ఉన్నాయి.