శివుడు మూడో కన్ను తెరిచిన ప్రదేశం..

శివుడు మూడో కన్ను తెరిచిన ప్రదేశం… ప్రపంచంలోనే అతిచిన్న నదీ ద్వీపం

అద్భుతమైన ప్రకృతి అందాలను అన్వేషించేందుకు ఈశాన్య భారతదేశం మీకు గొప్ప అవకాశాలను అందిస్తుంది. పచ్చదనంతో నిండిన పర్వతాలు, రాతి మార్గాలు, రంగులతో మెరిసే వాతావరణం, బ్రహ్మపుత్ర నది, దాని సహజ అందాలు మీకు మరచిపోలేని అనుభవాలను పంచుతాయి. ఈ ప్రాంతంలో ప్రకృతి వికాసం అందమైన ఛాయాచిత్రాల మాదిరిగా వైభవంగా కనిపిస్తుంది. ఈశాన్య భారతదేశం అన్ని కాలాల్లో పర్యటించదగ్గ అద్భుతమైన ప్రదేశం. కాబట్టి వింటర్ లో విరామం కోరుకునే వారు ఎక్కడికి వెళ్లాలో ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది.ఈశాన్య ప్రాంతం సాహసాలకు కూడా స్వర్గధామం వంటిది. ప్రాచుర్యం పెద్దగా లేని కొన్ని అద్భుతమైన రహస్య ప్రదేశాలు ఇక్కడి పర్యాటకంలో ప్రత్యేక ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది అస్సాంలోని ఉమానంద ద్వీపం. గొప్ప చారిత్రక, పురాణ ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రదేశం టూరిస్టుల దృష్టికి దూరంగా ఉంది. వాస్తవానికి ఇది ప్రపంచంలోనే అతి చిన్న నివాస ద్వీపం.

అతిపెద్ద బ్రహ్మపుత్ర నదిపై ఉన్న ఉమానంద ద్వీపం గువాహటి నగరానికి ఎంతో దూరంలో లేదు. గజి బిజీ నగర జీవనానికి దూరంగా ఉండే ఈ మనోహరమైన ద్వీపానికి బ్రహ్మపుత్ర నది మీదుగా ఫెర్రీ బోట్ ల ద్వారా 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మోటార్ బోట్లు కూడా ఇక్కడ లభిస్తాయి.

ఈ నదీ ద్వీపంలో ఉన్న శివాలయాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. అస్సాంలోని కామరూప్ జిల్లాలో ఉన్న 5 ప్రముఖ దేవాలయాల్లో ఇది ఒకటి. కామాఖ్య ఆలయాన్ని సందర్శించడానికి ముందుగా ఈ ఆలయాన్ని సందర్శించాలని భక్తుల నమ్మకం. బ్రిటిషర్లు ఈ ద్వీపాన్ని నెమలి ద్వీపం అని పిలిచేవారు. ఎందుకంటే ఇది నెమలి ఫించాల ఆకారాన్ని పోలి ఉంటుంది. ఎన్నో పురాణ గాధలు కూడా ఈ అరుదైన ప్రదేశం చుట్టూ అల్లుకుని ఉన్నాయి.