వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ మరిదిపై అర్ధరాత్రి రాళ్లదాడి

వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ మరిదిపై అర్ధరాత్రి రాళ్లదాడి

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ మరిది గోపినాథ్‌పై నిన్న అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. విడదల వారి ప్రభను కోటప్పకొండలో వదిలి కారులో ఇంటికి వస్తున్న సమయంలో దుండగులు ఆయన కారుపై రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మొన్న జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే అయిన విడదల రజనీకి సమాచారం ఇవ్వలేదు. దీంతో గోపినాథ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని ఎంపీని అడ్డుకున్నారు. ఆ తర్వాతి రోజే ఆయన కారుపై రాళ్ల దాడి జరగడం అనుమానాలకు తావిస్తోంది. కాగా, దాడి ఘటనపై గోపినాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.