ఎండల మల్లిఖార్జున స్వామీ ఆలయ విశేషాలు…!

త్రేతా యుగంలో శ్రీ రాముడు రావణ సంహారం అనంతరం సీతా సమేతంగా ఇక్కడ ఉన్న సుమంత విడిది చేసాడని కథనం. సుమంత పర్వతం పై ఉన్న ఔషధ మూలికలు చూసి, ఆ చుట్టుపక్కల ప్రజల అనారోగ్యాలను చూసి చలించిన సుశేణుడు ఇక్కడ మూలికలతో ప్రజలకు సేవ చేయాలని రాముని అనుమతితో అక్కడ శివుని గూర్చి ఘోర తపస్సు చేస్తాడు. కొన్ని రోజులకు హనుమ వచ్చి చూడగా అక్కడ అతని కళేబరం మాత్రమే ఉంటుంది. దానికి చింతిస్తూ ఒక గొయ్యి తీసి అందులో సుశేనుడి కళేబరం ఉంచి మట్టితో కప్పి పైన మల్లె పువ్వులు ఉంచి జింక చర్మంతో కప్పి వెంటనే వెళ్లి శ్రీ రామునికి విషయం చెప్పాడు.సీతా సమేతంగా అక్కడకు వచ్చిన శ్రీ రాముడు జింక చర్మం తీసి చూడగా అక్కడ శివ లింగం ప్రత్యక్షమైంది.

అంతట సీతారాములు పక్కనే ఉన్న కొలనులో స్నానం ఆచరించి ఆ శివ లింగానికి పూజ చేసారు. అయితే ఆ శివ లింగం పెద్దగా పెరుగుతుంది. ఔషధ మూలికల సువాసనలతో గాలి శివ లింగాన్ని తాకగా ఆ గాలి వీచినంతమేర ప్రజలు రోగాలు హరించి పోయాయట. మల్లె పువ్వులతో కప్పబడిన స్వామి కనుక మల్లిఖార్జున స్వామిగా పేరు వచ్చింది. ఇక్కడ సీతారాములు స్నానం చేసిన కొలనులో స్నానం చేస్తే దీర్ఘకాలిక వ్యాదులన్ని మాయం అవుతాయని భక్తుల నమ్మకం. ఈ స్వామిని దర్శిస్తే చాలు పంటలు సమృద్దిగా పండుతాయని ప్రజల విశ్వాసం.