‘జాను’ సినిమాకు హ్యాండ్ కర్చీఫ్‌తో వెళ్లండి

‘జాను’ సినిమాకు హ్యాండ్ కర్చీఫ్‌తో వెళ్లండి: సమంత

‘జాను’ సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లే ప్రతి ఒక్కరూ తమతో పాటు హ్యాండ్ కర్చీఫ్‌లు తీసుకువెళ్లాలని సమంత అక్కినేని సలహా ఇచ్చారు. సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికీ హ్యాండ్ కర్చీఫ్ అవసరం ఉంటుందని అన్నారు. శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘జాను’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’కి ఇది రీమేక్. మాతృకకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు వర్షన్‌నూ డైరెక్ట్ చేశారు. గోవింద్ వసంత సంగీతం సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. ఈనెల 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

‘జాను’ ఒక సింపుల్ సినిమా అని, కానీ ఎమోషన్స్ మాత్రం పైస్థాయిలో ఉంటాయని చెప్పారు సమంత. ‘‘ప్రతిరోజూ నేను ఒక ఎమోషనల్ సీన్ చేసేటప్పుడు ప్రతి షాట్‌లో నిజంగా ఏడ్చాను. ఒక పది టేక్‌లు తీసుకుంటే ప్రతి టేక్‌లోనూ గ్లిజరిన్ అవసరం లేకుండా నిజంగా ఏడ్చాను. దీనికి కారణం స్క్రిప్ట్, డైలాగ్స్, లవ్‌లో ఉన్న పవర్. కాబట్టి, మీరంతా హ్యాండ్ కర్చీఫ్‌తో సినిమాకు రండి. ప్రతి ఒక్కరికీ కావాల్సి వస్తుంది’’ అని సమంత వెల్లడించారు.