మాజి ఎస్వీ ప్రసాద్‌ కరోనాతో కన్నుమూత

ఉమ్మడి ఎపి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌వి ప్రసాద్‌ కరోనాతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఎస్‌వి ప్రసాద్‌ కుటుంబం మొత్తం ఇటీవల కరోనా బారినపడింది. దీంతో ప్రసాద్‌ దంపతులు యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స తీసుకుంటుండగానే.. పరిస్థితి విషమించి ఎస్‌వి ప్రసాద్‌ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.   ఆయన 1975 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారి. ఎస్‌వి ప్రసాద్‌ 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. రోశయ్య ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో సిఎస్‌గా సేవలందించారు. చంద్రబాబు సహా పలువురు ముఖ్యమంత్రులకు కార్యదర్శిగా పని చేశారు. నిబద్ధత కలిగిన ఉన్నతాధికారిగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో విజిలెన్స్‌ కమిషనర్‌గా పనిచేశారు.