49వ సిజెఐగా యుయు లలిత్‌ ప్రమాణం

భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్ ఉమేష్‌ లలిత్‌( యుయు లలిత్‌) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవనలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా, నవంబర్‌ 8 వరకు మాత్రమే అనగా కేవలం 74 రోజుల మాత్రమే సిజెఐగా ఉంటారు. ఆ సమయానికి ఆయనకు 65 ఏళ్లు నిండనున్నాయి. ఆ తర్వాత సీనియార్టీ జాబితాలో ఉన్న జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నియమితులయ్యే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సిజెఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పలువురు కేంద్రమంత్రులు తదితరులు హాజరయ్యారు.