పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన కంగనా

రచయిత జావేద్‌ అఖ్తర్‌ వేసిన పరువునష్టం కేసులో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సోమవారం ముంబయిలోని అంథేరి మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు హాజరయ్యారు. ఈ సారి గైర్హాజరైతే అరెస్టు వారెంట్‌ జారీ చేస్తామని కోర్టు హెచ్చరించిన నేపథ్యంలో ఆమె కోర్టుకు వచ్చారు. ఈ కేసులో కోర్టు ఫిబ్రవరిలో సమన్లు జారీచేసింది. సోమవారం నాడున కోర్టుకు హాజరుకాకుంటే వారెంట్‌ జారీచేస్తామని కోర్టు గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. కాగా, వారెంట్‌ ఇస్తామని పరోక్షంగా బెదిరించడంతో తాను మెజిస్ట్రేట్‌ కోర్టులో విశ్వాసం కోల్పోయానని, కోర్టు పక్షపాతంతో వ్యవహరిస్తోందని కంగనా ఆరోపించారు. కేసును వేరు కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ముందు దరఖాస్తు చేశామని కంగనా తరఫు న్యాయవాది రిజ్వాన్‌ సిద్ధిఖి కోర్టుకు తెలిపారు. అఖ్తర్‌కు వ్యతిరేకంగా కౌంటర్‌ ఫిర్యాదు ఇచ్చామని పేర్కొన్నారు. కంగనాపై ఆరోపణలు విచారణకు అర్హం కావని, బెయిలుకు అవకాశం ఉందని ఆయన వాదించారు. ఇలాంటి నేరాల విషయంలో ప్రతిసారి కోర్టు ముందు కంగనా హాజరుకావాల్సిన అవసరం ఉండదని అన్నారు.