బిజెపి అధ్యక్షుడు బండి సంజ‌య్‌కు 14 రోజుల రిమాండ్‌

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజ‌య్‌కు కరీంనగర్‌ కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు నిరసనగా ఆదివారం రాత్రి సంజయ్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన్ను మానకొండూర్‌లోని పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ తరలించారు. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం కరీంనగర్‌ కోర్టులో హాజరు పరిచారు. అయితే బండి సంజయ్ తరుపున బిజెపి లీగల్‌ సెల్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఆయనపై పోలీసులు నమోదు చేసిన ఐపిసి 353 సెక్షన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా ఆయనపై నమోదైన 10 కేసులు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు… ఆయనకు బెయిల్‌ను నిరాకరిస్తూ.. 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది.