మోడీ ‘బాధితుల’ జాబితాలో చేరిన యడియూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామాతో.. మోడీ సర్కార్‌పై కాంగ్రెస్‌ విమర్శనాస్త్రాలు సంధించింది. మోడీ మరో బాధితుడు యడియూరప్ప అంటూ వ్యాఖ్యానించింది. రాజీనామా చేయాలంటూ మోడీ ఒత్తిడి తీసుకువచ్చిన బిజెపి సీనియర్‌ నేతల జాబితాలో యడియూరప్ప మరో బాధితుడుగా చేరాడని కాంగ్రెస్‌ పేర్కొంది. ముఖ్యమంత్రులు, బిజెపి ఎమ్మెల్యేలుగా కొనసాగాలంటే కేంద్రంలోని నిరంకుశ పాలకుల అనుమతి ఉండాల్సిందేనని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సుర్జేవాలా పేర్కొన్నారు. అక్రమంగా, ఫిరాయింపు ద్వారా కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టిందని.. ఇది చట్టవిరుద్ధమని అన్నారు. కాంగ్రెస్‌ -జనతా దళ్‌ (సెక్యులర్‌) జెడిఎస్‌ల కూటమి ప్రభుత్వాన్ని పెగాసెస్‌ స్పైవేర్‌ ద్వారా బిజెపి కూల్చివేసిందని మండిపడ్డారు. మోడీ యడియూరప్పను అగౌరవపరచడం, హింసించడం, అవమానించడం ద్వారా బలవంతంగా రాజీనామా చేయించారని.. దీంతో మోడీ బాధితుల్లో ఒకరిగా యడియూరప్ప చేరారని సుర్జేవాలా ట్వీట్‌ చేశారు.