బొప్పాయి పండు గింజలు తింటే బరువు తగ్గుతారా..

బొప్పాయి పండు ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే. సంవత్సరమంతా దొరికే ఈ పండు ఎన్నో పోషక విలువలతో నిండి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా పళ్ళలాగే బొప్పాయి పండులో కూడా లోపల గింజలుంటాయి. చాలా పళ్ళలాగే ఇందులో కూడా గింజల్ని తీసేసి పండు తింటూ ఉంటాం. మనం ఎందుకలా చేస్తున్నామో ఒక్కసారైనా ఆలోచించారా? వాటి రుచి బావుండదని మనకి తెలుసు. అంతమాత్రాన అవి తినడానికి పనికిరావని అనుకోలేం కదా. చాలా లిమిటెడ్ క్వాంటిటీలో ఈ గింజల్ని కూడా తినచ్చు అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు.

బొప్పాయి గింజల్లో పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ-ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి జలుబూ, దగ్గూ లాంటి సామాన్యమైన సమస్యలనించే కాక దీర్ఘకాలిక అనారోగ్యాలనించి కూడ మనని రక్షిస్తాయి. బెంగుళూరు లోని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అంజూ సూద్ ఇలా అంటున్నారు, ” అన్ని గింజలూ విషం ఏం కాదు. కానీ, కొన్ని గింజలు మరీ చేదు గా ఉండటంతో అవి కడుపులో అసౌకర్యాన్ని కలుగచేస్తాయి”. చాలా మంది పోషకాహార నిపుణులు కూడా వీటిని తినచ్చనే చెప్తున్నారు.

ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉన్నందున అరుగుదలకి తోడ్పడి అధిక బరువు రాకుండా చేస్తాయి. ఈ ఫైబర్ బ్లడ్ ప్రెజర్ ని కూడా అదుపులో ఉంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని నియంత్రిస్తాయి. బొప్పాయి గింజల్లో మోనో అన్శాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి.