కల్నల్ సంతోష్ బాబు అంతియ యాత్ర ప్రారంభం

చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆయన పార్థీవ దేహంపై త్రివర్ణ పతాకం ఉంచిన సైనికాధికారులు.. సూర్యాపేట విద్యానగర్‌లో ఆయన స్వగృహం నుంచి అంతిమ యాత్ర ప్రారంభించారు. పూలతో అలంకరించిన వాహనంలో కల్నల్ మృతదేహాన్ని ఉంచే ముందు సైనిక వందనం సమర్పించారు. సంతోష్ బాబు మృతదేహం వద్ద అతడి తల్లిదండ్రులు, భార్య, ఇతర కుటుంబ సభ్యులు విలపించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. అంతకు ముందు.. సంతోష్ బాబును కడసారి చూసేందుకు సూర్యాపేట వాసులు భారీ సంఖ్యలో విద్యానగర్ చేరుకున్నారు.

కల్నల్ సంతోష్ బాబు అమర్ రహే అంటూ.. స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జాతీయ జెండాలు చేతబూని సంఘీభావం ప్రకటించారు. సంతోష్ బాబు పార్థీవ దేహాన్ని ఉంచిన వాహనంపై పూలు చల్లారు. సూర్యాపేట పక్కన ఉన్న కేసారం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో కల్నల్ అంత్యక్రియలు జరగనున్నాయి. అంతిమ యాత్రలో పాల్గొంటున్న వారు భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.