పెగాసెస్ పై దద్దరిల్లిన పార్లమెంట్‌

 పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల రెండోరోజూ పెగాసెస్‌ వ్యవహారం సెగ తగిలింది. ఫోన్ల హ్యాకింగ్‌పై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే.. ప్రతిపక్షాలు ‘పెగాసస్‌’ అంశంపై చర్చ జరపాలంటూ పట్టుబట్టాయి. పలువురు ఎంపిలు నినాదాలు చేశారు. సభను కొనసాగించేందుకు సహకరించాలని స్పీకర్‌ ఓం బిర్లా కోరారు. ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో నాలుగు నిమిషాలకే సభ వాయిదా పడింది. లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.రాజ్యసభకు ఇదే సెగ తాకింది. ఆందోళనల నడుమే ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ప్రతిపక్షాలు అడ్డుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.