లిచీ పండ్లు తింటున్నారా? జాగ్రత్త.. ప్రాణాలు పోతాయ్!

స్ట్రాబెరీ రూపంలో అందంగా మెరిసిపోయే లిచీ పండ్లు భలే రుచిగా ఉంటాయి. కానీ, ఈ పండ్లతో ప్రమాదం కూడా పొంచి ఉంది. దీన్ని ఎంతో ఇష్టంగా తినేవారికి ఇది దుర్వార్తే. కొద్ది నెలల కిందట బీహార్‌లో చిన్నారులు లిచీ పండ్లు తిని ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు కారణం ఆ పండ్లలో ఉండే ప్రమాదకర రసాయనాలే అని తేలింది. అవి ప్రత్యేకంగా కలిపే రసాయనాలు కాదు. ఆ పండ్లలో సహజ సిద్ధంగా ఉండే రసాయనాలు. అయితే, లిచీ పండ్లు తినేవారంతా ఎందుకు చనిపోవడం లేదనే సందేహం మీకు కలగవచ్చు. ఈ అనుమానం తీరాలంటే.. లిచీ పండ్ల గుర్తించి పూర్తిగా తెలుసుకోవల్సిందే.

సాధారణ పండ్లతో పోల్చితే లిచీలు చాలా భిన్నమైనవి. వీటిని ఖాళీ కడుపున (పరగడుపున) అస్సలు తినొద్దు. పచ్చిగా ఉండే లిచీ పండ్ల జోలికి అస్సలు వెళ్లొద్దు. ఇటీవల కొంతమంది వ్యాపారులు పచ్చి లిచీ పండ్లకు ఎర్ర రంగు వేసి అమ్మేస్తున్నారు. వాటిని తింటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. రాత్రులు నిద్రపోయే ముందు, ఉదయం ఖాళీ కడుపున లిచీ పండ్లను తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు వీటిని దూరంగా ఉంచడం చాలా మంచిదని చెబుతున్నారు.

లిచీ పండ్లలో ఉండే ఎక్యూట్‌ ఎన్‌సెఫలైటిస్‌ సిండ్రోమ్‌ (AES) వల్ల మెదడువాపు వ్యాధి కలిగిస్తాయని తేలింది. మెదడు వాపును శాస్త్రీయంగా ‘ఎన్‌సెఫలైటిస్’ అని అంటారు. లిచీ పండ్లలో ఉండే విషతుల్య పదార్థం వల్ల ఈ వ్యాధి సోకుతున్నట్లు వైద్యులు కనుగొన్నారు. అలాగే, ఉష్ణోగ్రతలు కూడా లిచీ పండ్లను విషతుల్యం చేస్తాయని ముజాఫర్‌పూర్‌లోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్‌లోని సీనియర్ డాక్టర్ గోపాల్ శంకర్ సహానీ పేర్కొన్నారు. ఆయన 1995లో దీనిపై పరిశోధనలు చేశారు. గాలిలో తేమ శాతం తగిన స్థాయిలో ఉంటే మెదడు వాపు రావచ్చని తెలిపారు. ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు ఉండి తేమ 65 నుంచి 80 శాతం ఉన్నట్లయితే లిచీలు ఆరోగ్యానికి హాని చేస్తాయన్నారు.