‘సైనికుడు’ నటుడి మరణంపై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అకాల మరణంపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ.. ఎమోషనల్ ట్వీట్ చేశారు. గత కొన్నాళ్లుగా న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) తో పోరాడుతున్న ఇర్ఫాన్ ఖాన్ బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణంపై మహేష్ బాబు స్పందిస్తూ.. ‘ఇంత బ్రిలియంట్ యాక్టర్‌ని ఇంత త్వరగా కోల్పోతాం అని ఊహించలేదని.. ఆయన అకాల మరణ వార్తతో చాలా బాధపడ్డా’ అన్నారు మహేష్ బాబు. అతన్ని మిస్ అయ్యాం ఇర్ఫాన్ ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నా అన్నారు మహేష్ బాబు.

బాలీవుడ్‌లో ‘సలామ్ బాంబే’, ‘కఖ్బూల్’, ‘పాన్ సింగ్ తోమార్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్.. ‘స్లమ్‌డామ్ మిలియనీర్’, ‘ఇన్ఫెర్నో’, ‘లైఫ్ ఆఫ్ పై’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో సైతం నటించారు. తెలుగులో ఆయన నటించిన ఒకే ఒక్క సినిమా మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సైనికుడు’. ఈ చిత్రంలో పప్పు యాదవ్‌గా విలన్‌గా నటించి తన విలక్షణ నటనను చూపించారు. ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి నటించిన మహేష్ బాబుకి ఆయనతో మంచి అనుబంధం ఉండటంతో ట్విట్టర్‌లో స్పందించారు మహేష్ బాబు.

మహేష్ బాబుతో పాటు సాయి పల్లవి, హన్సిక, కార్తికేయ తదితర టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఇర్ఫాన్ ఖాన్‌ ఆత్మకు శాంతి చేకూరని కోరుతూ ఆయన కుటుంబానికి ట్విట్టర్ ద్వారా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.