లాప్‌టాప్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే..

కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. లాక్ డౌన్ ప్రకటించినప్పుడు వాళ్ళ జీవితం ఇలా మారిపోతుందని ఎవరూ ఊహించలేదు. మనకి అనువైన సమయంలో అనువైన చోట కూర్చుని పని చేసుకోవడమనేది మొదట్లో చాలా ఉత్సాహంగా అనిపించింది. కానీ, ఒక నెల రోజులకి చాలామందికి వెన్ను నొప్పి, మెడ నొప్పులు మొదలైపోయాయి. ప్రతిరోజూ ఇంట్లో నుంచే పనిచేసే పద్ధతిలో చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ఇలాంటి సమస్యల బారిన పడకుండా హాయిగా పని చేసుకోడానికి కొన్ని టిప్స్ పాటించండి..

లాప్ టాప్ మీద పని చెయ్యడం ఎంత సౌకర్యవంతంగా ఉన్నా, అధికశాతం మెడ, వీపు, భుజాలు నొప్పి పుట్టడానికి కారణం ఇదే. దీనికి కారణం లాప్ టాప్ స్క్రీన్, కీబోర్డ్ విడిగా ఉండకపోవడం. దీంతో కీబోర్డ్ సరిగ్గా ఉంటే, స్క్రీన్ చూడడం కోసం తల వంచాల్సి వస్తుంది. స్క్రీన్ సరిగ్గా ఉంటే టైప్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. దీనికి పరిష్కారం మరో కీబోర్డ్ కొనుక్కోడమే.

మనలో చాలా మంది డైనింగ్ టేబుల్ దగ్గర కానీ, మంచం మీద కూర్చుని కానీ పని చేస్తుంటాం. దీంతో తల వంచి పని చేయాల్సి వస్తుంది. మీ ఇంట్లో ఆఫీస్ టేబుల్, కుర్చీ లేనట్లైతే లాప్ టాప్ కింద కొన్ని పుస్తకాలు పెట్టుకోండి. ఎత్తు సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఎక్కువగా నొప్పులు రావు..

మీరు మంచం మీద కూర్చుని పని చేసేటట్లైతే మీ ఒడి లోనూ, మీ వీపు వెనకాలా కూడా కుషన్స్ పెట్టుకోండి. మీ లాప్ టాప్ ని మీ ఒళ్ళో ఉన్న కుషన్ మీద పెట్టుకోండి. దీని వల్ల అంతగా ఒత్తిడి అనిపించదు. మీరు హాయిగా పనిచేసుకోవచ్చు. ఇవి కూడా చాలా మెత్తగా, తేలిగ్గా ఉండేవి చూసుకోండి.. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ఎంత కంఫర్ట్‌గా ఉన్నా సరే.. కచ్చితంగా ల్యాప్ టాప్ స్టాండ్ తీసుకోండి. దీని వల్ల మీరు మరింత సౌకర్యవంతంగా పనిచేసుకోవచ్చు. కాబట్టిప్రస్తుతం దొరికితే కనక తప్పనిసరిగా లాప్ టాప్ స్టాండ్ కొనుక్కోండి. ఇంటి నించి పని చెయ్యడానికి అది చాలా సులువుగా ఉంటుంది. ఇలా కొన్ని టిప్స్‌ని పాటించడం వల్ల మీ పని మరింత సులభం అవుతుంది.