వైసీపీకి షాకిచ్చిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.

వైసీపీకి షాకిచ్చిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.. షోకాజ్‌కు ఊహించని సమాధానం

వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఎంపీ రఘురామకృష్ణంరాజు సమాధానం ఇచ్చారు. ఊహించని విధంగా.. చాలా లాజికల్‌గా స్పందించారు. సమాధానం ఇస్తూ రాసిన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. తనకు పంపిన షోకాజ్ నోటీస్‌‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని రాశారని.. కానీ తాను ఎంపీగా గెలిచింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు మీద అంటూ ట్విస్ట్ ఇచ్చారు. అంతేకాదు అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరొకటి ఉందన్నారు. ఎన్నికల సంఘానికి సంబంధించిన కొన్ని నిబంధనల్ని వివరించారు. అంతేకాదు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరు మీద తనకు షోకాజ్ నోటీస్ పంపారని.. కానీ తాను గెలిచిన పార్టీ ప్రాంతీయ పార్టీ అని గుర్తు చేశారు.

జాతీయ ప్రధాన కార్యదర్శి నుంచి షోకాజ్ నోటీస్ అందుకున్నానని.. ఎన్నికల సంఘానికి పార్టీ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని.. వారి ద్వారా నోటీసులు పంపాలని పరోక్షంగా గుర్తు చేశారు. దీనికి సంబంధించి కొన్ని నిబంధనల్ని లేఖలో ప్రస్తావించారు. ఆ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ కమిటీ సమావేశమై చర్చించి.. ఆ తర్వాత ఛైర్మన్, సభ్యులు కలిసి షోకాజ్ నోటీసులు పంపాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఒకవేళ అలాంటి సమావేశం జరిగితే.. ఆ భేటీకి సంబంధించిన మినిట్స్ ఎక్కడున్నాయని ప్రశ్నించారు.