నిర్బయ దోషులకు ఢిల్లీ కోర్టు మూడోసారి డెత్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. నలుగురు దోషులనూ మార్చి 3న ఉదయం 6 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయనున్నారు. ఈ నేపథ్యంలో నిర్బయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేగింది. తన సెల్‌లోని గోడకు తల బాదుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన సిబ్బంది అతడిని వైద్యం కోసం హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకోడానికి దోషులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరణశిక్ష నుంచి బయటపడటానికి దారులన్నీ మూసుకుపోవడంతో దోషి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మార్చి 6న ఉరి అమలుచేయనుండటంతో వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలోనూ వినయ్ శర్మ ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
రెండు రోజుల కిందటే వినయ్ శర్మ నిరాహార దీక్షకు చేపట్టినట్టు జైలు వర్గాలు కోర్టుకు తెలిపాయి. వినయ్ శర్మ ఆహారం తీసుకోవడంలేదని చెప్పడంతో చట్టపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రయల్ కోర్టు తీహార్ జైలు అధికారులకు స్పష్టం చేసింది. వినయ్ శర్మ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, వినయ్ శర్మ మానసిక వ్యాధికి గురయ్యాడని, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి ఉరి అమలు చేయడం కష్టమని తెలిపారు.