‘ఒరేయ్‌ బామ్మ‌ర్ది’ మూవీ రివ్వ్యూ

బొమ్మరిల్లు’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్థ్‌. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి సినిమాలతో అలరించి, తెలుగు తెరకు గ్యాప్‌ ఇచ్చాడు. తనదైన నటనతో యూత్ మంచి ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఆయన.. ఈ గ్యాప్‌లో కొన్ని తమిళ సినిమాలు నటించి, వరుస పరాజయాలను మూటగట్టుకున్నాడు. తాజాగా  ‘ఒరేయ్‌ బామ్మర్ది’ అంటూ ఓ డిఫరెంట్ తెలుగు సినిమాతో రంగంలోకి దిగాడు. తమిళ సినిమా ‘శివప్పు మంజల్ పచ్చై’సినిమాకు రీమేక్‌ ఇది. ‘బిచ్చగాడు’ఫేమ్‌ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండ‌గా, ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌ కీలక పాత్రలో నటించాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌,ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై పాజిటివ్‌ బజ్‌ని క్రియేట్‌ చేశాయి. వాస్తవానికి ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్‌ మాత్రం థియేటర్లలోనే విడుదల చేయాలనే పట్టుదలతో ఆగస్ట్‌ 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ సినిమా సిద్దార్థ్‌ను హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? ‘ఒరేయ్‌ బామ్మర్ది’ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.

కథ ఏంటంటే : రాజశేఖర్‌(సిద్దార్ద్‌) ఓ సిన్సియర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌. తన డ్యూటీ చాలా సిన్సియర్‌గా చేస్తూ ఉంటాడు. ఆ టైమ్‌లో రోడ్లపైన బైక్‌ రేస్‌లంటూ పబ్లిక్‌కు న్యూసెన్స్‌ కల్గించే కుర్ర గ్యాంగ్‌ను పట్టుకొని వాయిస్తాడు. అంతేకాక ఆ గ్యాంగ్‌ లీడర్‌ అయినటువంటి మదన్‌(జీవీ ప్రకాశ్‌) ఆడపిల్ల డ్రస్‌ వేసి బాగా అవమానిస్తాడు. తనకు జరిగిన అవమానానికి ఎలాగైన ప్రతీకారం తీర్చుకోవాలని మదన్‌ సమయం కోసం చూస్తూంటూడు. ఈలోపు మదన్‌ను కన్నతల్లిగా పెంచి పెద్దచేసిన అతని అక్క రాజీ(లిజోమోన్‌ జోన్‌)తో రాజశేఖర్‌కు పెళ్లి నిశ్చయమౌతుంది. ఎలాగైనా పెళ్లి చెడగొట్టాలని మదన్‌ ఎత్తులు వేస్తే రాజశేఖర్‌ వాటికి పై ఎత్తులు వేసి వాటిని చెడగొడతాడు. రాజ్‌శేఖర్‌, రాజీల పెళ్లి జరుగుతుంది. దీంతో మదన్‌ అక్కపై ద్వేషం పెంచుకొని ఇంటి నుంచి వెళ్లిపోతాడు. ఈలోపు చైన్‌ స్నాచింగ్‌ కేసులో మదన్‌ ఇరుక్కుంటాడు. మదన్‌ను విడిపించేందుకు రాజశేఖర్‌ రంగంలోకి దిగుతాడు. మరోవైపు డ్రగ్స్‌ సరఫరా చేసే విలన్‌తోనూ రాజశేఖర్‌కు వైరం ఏర్పడుతుంది. అయితే విలన్‌ పని ఎలా పడతాడు, కేసు నుంచి మదన్ను తప్పించి అక్కా తమ్ముళ్లను ఎలా కలుపుతాడు అనేది మిగిలిన కథ