కరోనాను జయించిన ప్రకాశం.. ఏపీలో మొట్టమొదటి జిల్లాగా రికార్డు

ప్రకాశం జిల్లా కరోనా (కోవిడ్ 19) మహమ్మారిని జయించింది. జిల్లాలో కరోనా బారినపడ్డ వారందరూ డిశ్చార్జి అయ్యారు. దీంతో జిల్లాలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య సున్నాకు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రోగులంతా కోలుకుని సున్నా యాక్టివ్ కేసులు ఉన్న మొట్టమొదటి జిల్లాగా ప్రకాశం జిల్లా రికార్డులకెక్కింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది.

కాగా, ప్రకాశం జిల్లాలో మొత్తం 63 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడ్డ వారందరూ శనివారానికి డిశ్చార్జి అయ్యారు. వారం క్రితం జిల్లాలో ఒక్క కరోనా యాక్టివ్ కేసు ఉండగా, తర్వాత ఒకే రోజు రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో గత కొన్ని రోజులుగా మూడు కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఒకే రోజు మూగ్గురు డిశ్చార్జి కావడంతో జిల్లాలో యాక్టివ్ కేసులు ‘సున్నా’ అయ్యాయి.