అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య

అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని ఖైరతాబాద్‌ ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి మారుతీరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి ఆయన ఆర్యవైశ్య భవన్‌లో బస చేశారు. ఆయన భార్య ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె ఆర్యవైశ్య భవన్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.

మారుతీరావు రూమ్ డోర్ తీయకపోవడంతో సిబ్బంది బలవంతంగా తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే ఆయన మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. విషం తాగినట్లు గుర్తించిన సిబ్బంది అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మారుతీరావు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మారుతీరావు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లకు పడగలెత్తాడు. కూతురు అమృత ప్రేమను అంగీకరించలేక పోయిన మారుతీరావు దారుణానికి పాల్పడ్డాడు. పెద్దలను ఎదిరించి కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో కక్ష పెంచుకున్నాడు. పరువు హత్యకు పాల్పడ్డాడు. అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతక ముఠాకి సుపారీ ఇచ్చి దారుణంగా హత్య చేయించాడు.