పవన్ కళ్యాణ్‌తో రాజమౌళి మూవీ..!

తెలుగు సినీ పరిశ్రమలోని దర్శకుల్లో రాజమౌళి, హీరోల్లో పవన్ కళ్యాణ్ క్రేజే వేరు. వారి సినిమాలంటే జనాల్లో ఏదో తెలియని ఆసక్తి. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలకు భారీ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన రాజమౌళి.. పవన్ కళ్యాణ్‌తో మాత్రం సినిమా చేయలేకపోయారు. వీళ్లిద్దరి కాంబోలో సినిమా చూడాలని ఎంతోకాలం నుంచి ప్రేక్షకలోకం ఎదురు చూస్తోంది. వీళ్ళ మూవీ ఓకే అయింది, త్వరలోనే సెట్స్ మీదకు రాబోతుంది అనే వార్తలు కూడా షికారు చేశాయి. తాజాగా ఈ ఇష్యూపై స్పందించారు రాజమౌళి.

ప్రస్తుతం RRR మూవీతో బిజీగా ఉన్న రాజమౌళి.. ఈ లాక్‌డౌన్ వేళ ఇంట్లోనే ఉంటూ పలు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఆయన పవన్ కళ్యాణ్‌తో సినిమా విషయమై రియాక్ట్ అయ్యారు. పవన్‌తో కలిసి సినిమా తీసే అవకాశాలు లేవని రాజమౌళి కుండబద్దలు కొట్టేశారు. అందుకు కారణం కూడా ఉందని పేర్కొంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జక్కన్న.

గతంలోనే పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనుకున్నానని, అందుకోసం ఆయనను కలవడం కూడా జరిగిందని రాజమౌళి అన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడు కుదరకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదని చెప్పారు. ఇక ఇప్పుడు పవన్ రీ ఎంట్రీ ఇచ్చారు కాబట్టి మళ్ళీ చేద్దామన్నా.. తన సినిమాకు అవసరమయ్యేంత ఎక్కువ సమయం పవన్ ఇవ్వలేరని, ఆయన దృష్టంతా ప్రజాసేవ పైనే ఉంటుందని అన్నారు రాజమౌళి. సో.. ఇక పవన్‌తో సినిమా తీసే అవకాశం ఉండదని ఆయన తేల్చేశారు.