రవితేజ ‘రామారావు’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

మాస్‌ మహారాజ రవితేజ కెరీర్‌లో 68వ మూవీగా శరత్‌ మండవ దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మాతగా ఎస్‌ఎస్‌వి సినిమాస్‌, ఆర్‌టి టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై రూపొందుతున్న చిత్రానికి ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ను కన్ఫర్మ్‌ చేశారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని చిత్ర యూనిట్‌ సోమవారం విడుదల చేసింది. రామారావు ఆన్‌ డ్యూటీ చిత్రానికి నూతన దర్శకుడు దర్శకత్వం వహించినప్పటికీ, దీనికి సంబంధించిన ప్రతి అనౌన్స్‌మెంట్‌ ఈ మూవీపై క్యూరియాసిటీని పెంచింది. ఇప్పటివరకూ విడుదల చేసిన రెండు పొస్టర్స్‌లోనూ రవితేజ ముఖం కనిపించనప్పటికీ ఆ పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో రవితేజ హాఫ్‌ స్లీవ్‌ షర్ట్‌, ఫార్మల్‌ ప్యాంటు వేసుకుని ట్రెండీ గాగుల్స్‌తో సూపర్‌స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ చూస్తుంటే నిజాయితీ, దూకుడుగా ఉన్న ప్రభుత్వ అధికారిగా రవితేజ నటించారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పోస్టర్‌లో బి.రామారావుగా ప్రమాణ స్వీకారపు లేఖ కూడా ఉంది. ఆయనకు కేటాయించిన ప్రభుత్వ వాహనాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో చూడవచ్చు. టైటిల్‌ పోస్టర్‌ కూడా అద్భుతంగా రూపొందించబడింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ రియల్‌ ఇన్స్‌టెండ్స్‌ ఆధారంగా ఒక యూనిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. రవితేజ, హీరోయిన్లలో ఒకరిగా నటిస్తోన్న దివ్యాంశ కౌశిక్‌, ఇతర తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. చిత్రానికి స్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తుండగా సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేస్తున్నారు.