దమ్ముంటే వాళ్ల పేర్లు బయటపెట్టండి.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

తెలంగాణలో కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపణలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే వాళ్ల పేర్లు బయటపెట్టాలని కేసీఆర్‌కు సవాల్ చేశారు. బలవన్మరణానికి పాల్పడ్డ రైతుల పేర్లను 48 గంటల లోపల బయటపెడితే తాను బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తానని స్పష్టం చేశారు. ఏప్రిల్ 6న జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఎం రేవంత్ తుక్కుగూడకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. మాజీ సీఎం కేసీఆర్ జనగాం, సూర్యాపేట జిల్లా పర్యటనలపై రేవంత్ స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, ఎంపీలు పార్టీని వీడటం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ పర్యటన చేపట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.