తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం కేసీఆర్ ధన దాహానికి బలైంది..!

తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు హైదరాబాద్ నుంచి బస్సులో మేడిగడ్డకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.97వేల కోట్ల వ్యయం చేసి కనీసం 97 వేల ఎకరాలకు నీరు ఇవ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు.

ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీ తానై కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలిపోయి నెలలు గడుస్తున్నప్పటికీ నోరు విప్పడం లేదని మండిపడ్డారు. మేడిగడ్డ మరమ్మతులకు పనికిరాదు… పూర్తిగా పునర్నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సమాజానికి వాస్తవాలు తెలిపే ప్రయత్నమే ప్రజాప్రతినిధుల ఈ మేడిగడ్డ పర్యటన అన్నారు.