రియాలిటీ షో జడ్జిగా రాధ

 వెండి తెరపై తమ అందం అభినయం తో అలరించిన సదా, మాధురీ దీక్షిత్, ప్రియమణి వంటి ఎందరో  హీరోయిన్లు  బుల్లి తెరపై వివిధ షోలకు వ్యాఖ్యాతగా , జడ్జిలుగా వ్యవహరిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. వీరి బాటలో నడవడానికి అలనాటి సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ రెడీ అయ్యింది. తన డ్యాన్స్ తో నవ్వుతో అప్పట్లో కుర్రకారు మతులు పోగొట్టిన రాధా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించనున్నారు. ఓ టీవీ ఛానెల్‌లో జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న “సూపర్‌ క్వీన్‌” కార్యక్రమానికి రాధ జడ్జ్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని రాధ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. చాలాకాలం తర్వాత ఓ రియాల్టీ షో ద్వారా మళ్లీ మీ ముందుకు వస్తున్నానని రాధ ట్వీట్ చేసారు. తన సహ న్యాయనిర్ణేతగా నకుల్ వ్యవహరిస్తున్నారని, ఇందుకు చాలా సంతోషదాయకంగా ఉందని పేర్కొన్నారు. ఈ షోలో ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తున్నానని ఈ అందాలనటి పేర్కొన్నారు. ఎంతోమంది అమ్మాయిల ప్రతిభను ఈ కార్యక్రమం ద్వారా చూడటం గర్వంగా ఉందని తెలిపారు. అంతేకాదు, ‘సూపర్ క్వీన్’ ప్రోమో కూడా పంచుకున్నారు.