ఫిబ్రవరిలో శర్వానంద్‌ ‘ఒకే ఒక జీవితం’

యంగ్ హీరో శర్వానంద్ కెరీర్‌‏లో 30వ సినిమాగా రూపొందుతోన్న మైల్ స్టోన్ మూవీ ఒకే ఒక జీవితం. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైఫై సినిమాకు తరుణ్ భాస్కర్‌ మాటలను అందించారు.దీపావళి సందర్బంగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఇందులో అక్కినేని అమల గోడపై కూర్చుని ఉన్నారు. శర్వానంద్, అతని తమ్ముడు అమ్మ ఒడిలో తల పెట్టుకుని అలా సేద తీరుతున్నారు. ఈ పోస్టర్‌తో సినిమాపై పాజిటివ్ వైబ్స్ కలుగుతున్నాయని అభిమానులు అంటున్నారు. ఇక తెలుగమ్మాయి రీతూ వర్మ ఈ చిత్రంలో శర్వానంద్ పక్కన హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే ఇందులో వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్‌లు ఈ చిత్రంలో భాగం అయ్యారు. శర్వానంద్‌కు క్రేజ్‏కి తగ్గట్టుగా ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్‌ను ఆకట్టుకునేలా ఉండబోతోంది. తల్లీ కొడుకుల బంధం అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేస్తుందని టాక్. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది.