ఏపీలో జూన్‌ 30 వరకు వేసవి సెలవులు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులను జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లుఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్‌ చిన వీరభద్రుడు ఉత్తర్వులను జారీ చేశారు. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరం జూన్ 3వ తేదీతో ముగియనుంది. జూన్‌ 12వ తేదీ నుంచి అన్ని తరగతులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్థుల విషయంలో ప్రధానోపాధ్యాయులు అవసరమైన విద్యా సహాయాన్ని జూన్‌ 1 నుంచే కొనసాగించాలని ఆదేశించారు. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండానే మరోమారు సెలవులను పొడిగించింది. అయితే జూన్ 30 తర్వాత అప్పటి పరిస్థితిని సమీక్షించి సెలవులు పొడిగించాలా.? లేక పరీక్షలు నిర్వహించాలా.? అనే అంశంపై ఓ నిర్ణయానికి వస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.