జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాల్సిందే : సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల బోర్డులు ఇంటర్నల్‌ మార్కుల అసెస్‌మెంట్‌ను పూర్తి చేసి, జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. పది రోజుల్లోగా బోర్డులను మూల్యాంకన విధానాన్ని రూపొందించి కోర్టుకు తెలియజేయాలని సూచించింది. 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు నేడు విచారణ జరిపింది. అయితే, బోర్డులన్నింటికీ ఏకరూప మూల్యాంకన విధానం ఉండేలా ఆదేశాల ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రతి బోర్డు స్వయంప్రతిపత్తి కలిగి ఉందని, అందువల్ల బోర్టులు తమ సొంత మూల్యాంకన విధానాలను రూపొందించుకునే హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినందున అంతర్గత మార్కుల ఆధారంగా మూల్యాంకనం చేపట్టి వచ్చే నెల 31లోగా ఫలితాలను వెల్లడించాలని కోర్టు స్పష్టం చేసింది. అంతకుముందు సిబిఎస్‌ఇ, సిఐఎస్‌సిఇ బోర్డులకు కూడా సుప్రీంకోర్టు ఇదే తరహా ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయా బోర్డులు తమ మూల్యాంక విధానాన్ని కోర్టుకు తెలియజేశాయి. జులై 31లోగా 12వ తరగతి ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించాయి. కాగా, కరోనా మహమ్మారి కారణంగా 12వ తరగతి పరీక్షలను ఇప్పటి వరకు 21 రాష్ట్రాలు రద్దు చేయగా.. 6 రాష్ట్రాలు పరీక్షలను నిర్వహించాయి.