పరీక్షలపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!

స్టేట్‌ బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో అఫిడవిట్‌ ఎందుకు దాఖలు చేయలేదని నిలదీసింది. పరీక్షలకు నిర్వహణకు సంబంధించి స్పష్టమైన వైఖరి తెలియజేస్తూ బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం కరోనా సమయంలో భౌతికంగా పరీక్షలు నిర్వహిస్తే.. దీని వలన ఒక్క విద్యార్థి మరణించినా, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా జస్టిస్‌ ఎఎం.ఖాన్‌విల్కర్‌, దినేష్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ”ప్రతి విద్యార్థి జీవితం విలువైనది” అని కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన వాదనకు అనుకూల వ్యాఖ్యలు చేసింది. బోర్డు పరీక్షలు నిర్వహించాలని అనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. తుది నిర్ణయాన్ని జులైకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత కరోనా కాలంలో భౌతికంగా పరీక్షలు నిర్వహించడం అహేతుకమని, విద్యార్థుల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును అనిశ్చితంగా ఉంచలేమని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.