తెలుగు రాష్ట్రాలకు తమిళ్ హీరో విజయ్ విరాళం..

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదిక‌న చ‌ర్యలు చేప‌డుతున్నాయి. కరోనాపై పోరాటానికి కొన్నివేల కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. క్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి వైద్య సిబ్బందికి అవసరమైన పరికరాలు అందజేయడం, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పనులే. అందుకే, ఈ పోరాటంలో ప్రభుత్వాలకు తమ వంతు సాయం అందిస్తున్నారు సినీ తారలు. దేశంలోని అన్ని సినీ పరిశ్రమల నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందజేశారు.

తాజాగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన వంతు సాయంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాల సహాయ నిధులకు రూ.1.30 కోట్లను విరాళంగా ప్రక‌టించారు. ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స‌హాయ నిధులకు చెరో రూ.5 ల‌క్షలు చొప్పున అందజేశారు. అలాగే ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలు, కేరళ సహాయ నిధికి రూ. 10 లక్షలు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల సహాయ నిధులకు చెరో రూ. 5 లక్షలు, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) నిధికి రూ. 25 లక్షలు ప్రకటించారు.