హైదరాబాద్ టు చెన్నై.. 650 కి.మీ. బైక్‌పై ఒంటరిగా వెళ్లిపోయిన హీరో అజిత్

తమిళ స్టార్ హీరో అజిత్‌కు స్పోర్ట్స్, ప్రీమియం బైకులంటే ఎంతో మక్కువ. ఆయన దగ్గర చాలా స్పోర్ట్స్ బైకులు ఉన్నాయి. రేస్ ట్రాక్‌పై ఆయన పోటీ కూడా పడ్డారు. రేసర్‌గా ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. చెన్నై రోడ్లపై అజిత్ స్పోర్ట్స్ బైక్‌లపై చక్కర్లు కొట్టిన ఎన్నో వీడియోలు, ఫొటోలు గతంలో బయటికి వచ్చాయి. అయితే, ఆయన ఇటీవల ఏకంగా హైదరాబాద్ నుంచి చెన్నైకి బైక్‌పై వెళ్లిపోయారట. ఈ విషయం ‘వాలిమయి’ సినిమా యూనిట్‌లో కొందరు వ్యక్తుల ద్వారా తెలిసింది. ఈ సినిమాలో అజిత్ హీరోగా నటిస్తున్నారు. పోలీస్ అధికారి పాత్ర పోషిస్తున్నారు.

చిత్ర యూనిట్ ద్వారా బయటికి వచ్చిన సమాచారం ప్రకారం.. ‘వాలిమయి’ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. బైక్ చేజ్ సీక్వెన్స్‌ను ఇక్కడ చిత్రీకరించారు. దీని కోసం సుజుకి కంపెనీకి చెందిన సూపర్ బైక్‌ను తెప్పించారు. అజిత్ స్వయంగా ఈ బైక్ చేజ్ సీక్వెన్స్‌లో పాల్గొన్నారు. డూప్ లేకుండా చేశారు. అయితే, ఆ బైక్ అజిత్‌కు విపరీతంగా నచ్చేసిందట. దీంతో దానిపైనే చెన్నై వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారట. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తిచేసుకుని చిత్ర యూనిట్ తిరిగి చెన్నై పయనమైంది. అయితే, తన విమాన టిక్కెట్ క్యాన్సిల్ చేయమని అజిత్ యూనిట్‌కు చెప్పారట. తాను ఒక్కడినే సూపర్ బైక్‌పై చెన్నై వచ్చేస్తానని వారిని ఒప్పించారట.

దీంతో చిత్ర యూనిట్‌తో పాటు అజిత్ అసిస్టెంట్స్ కూడా విమానంలో చెన్నై వెళ్లిపోగా.. అజిత్ రోడ్డు మార్గంలో 650 కిలోమీటర్లు ఒంటరిగా బైక్‌పై ప్రయాణించి చెన్నై చేరుకున్నారట. కేవలం పెట్రోల్, ఆహారం కోసం మాత్రమే మధ్యలో అజిత్ బ్రేక్ తీసుకున్నారట. మరి ఈ స్టార్ తనను గుర్తుపట్టకుండా పెట్రోల్ బంకులు, హోటల్స్ వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో తెలీదు. కాగా, ‘వాలిమయి’ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. హుమా ఖురేషి హీరోయిన్. లాక్‌డౌన్ సమయం పూర్తికాగానే షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.