ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో, వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యలు ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని… ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుపట్టారు. అయితే, టీడీపీ సభ్యుల అరుపులను స్పీకర్ పట్టించుకోలేదు. మరోవైపు, టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు పలు బిల్లులను ప్రవేశ పెట్టారు. దీంతో, టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకుపోయారు. పోడియం ఎక్కి మరీ నినాదాలు చేశారు. స్పీకర్ ఛైర్ వద్దకు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులు… బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో శాసనసభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీంతో, టీడీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఒక రోజు స్పీకర్ సస్పెండ్ చేశారు.