ఇడి విచారణకు రకుల్‌ ప్రీత్‌

డ్రగ్స్‌ కేసులో సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు హాజరయ్యారు. రకుల్‌ రాక నేపథ్యంలో ఇడి కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మీడియాను లోపలికి అనుమతించలేదు. ఇప్పటికే ఇదే డ్రగ్స్‌ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్‌, ఛార్మీలను ఇడి ప్రశ్నించింది. కాగా, ఇది అధికారుల షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 6న విచారణకు రకుల్‌ హాజరు కావాల్సి ఉండగా.. ఆరోజు తనకు కుదరదని, మరో తేదీని కేటాయించాలని కోరారు. అయితే తేదీ మార్చేందుకు ఇడి అధికారులు రాకపోవడంతో… ఆ తేదీ కన్నా ముందు విచారణకు వచ్చేందుకు తాను సిద్ధమేనంటూ మరో మెయిల్‌ను రకుల్‌ పంపారు. దీనికి అంగీకరించిన అధికారులు ఈ నెల 3న విచారణకు రావాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఇడి విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్‌ వినియోగం, డ్రగ్స్‌ సరఫరా, మనీ లాండరింగ్‌, ఫెమా వంటి వాటిపై ఇడి అధికారులు ప్రశ్నిస్తున్నారు.