రామాయణ టీమ్‌లోకి త్రివిక్రమ్‌..

మానవ జీవితం ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. ఇందులోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌లో రామయణ పేరుతో సినిమా రానుంది.

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణలో రణ్‌బీర్‌కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుంది. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్‌ హీరో యశ్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ బాలీవుడ్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్‌ డైలాగ్స్‌ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు మేకర్స్‌ అప్పగించినట్లు సమాచారం. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు ఉండటంతో చిత్ర యూనిట్‌ ఆయన్ను సంప్రదించిందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ఈ ఏడాదిలో గుంటూరు కారంతో ప్రేక్షకులను మెప్పించిన త్రివిక్రమ్‌ తన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. అయితే రామాయణ టీమ్‌లోకి త్రివిక్రమ్‌ చేరడం దాదాపు లాంఛనమే అని చెప్పవచ్చు. ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి రోజున ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే ఛాన్స్‌ వుంది.