ఉగాది పచ్చడి ఆంతర్యం .. ఏమిటో తెలుసా..!

తెలుగు క్యాలెండర్ లో మొదటి రోజుని ఉగాదిగా జరుపుకుంటారు. బ్రహ్మ సృష్టిని మొదలు పెట్టిన రోజు యుగానికి ఆది ఉగాదిగా భావించి చైత్ర మాసం పాడ్యమి రోజుని తెలుగు వారంతా గొప్ప‌గా జ‌రుపుకుంటారు. హిందువులు జరుపుకునే అన్ని పండగలు చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి జరుపుకునేవే.. ఒక్క మకర సంక్రాంతి తప్పా.. అయితే మనసుకు అధిపతి అయిన చాంద్రమానాన్ని అనుసరించి ప్ర‌కృతిలో మార్పు కార‌ణంగా జరుపుకునే మొదటి పండుగ‌ ఉగాది. ఉగాది అనగానే అందరి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ రోజున గొప్ప‌త‌నం అంతా ఉగాది ప‌చ్చ‌డిలోనే ఉంటుంది. ష‌డ్రుచుల స‌మ్మేళ‌నంతో తయారు చేసే ఉగాది పచ్చడికి ఆధ్యాత్మికతో పాటు ఆరోగ్యం పరంగాను ప్రాముఖ్యత ఉంది.

కొత్త సహస్రాబ్ధికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఉగాది నుంచి ఏడాది పొడుగునా ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను, ఆనందవిషాదాలను సమన్వయంతో, సానుకూల దృక్పధంతో స్వీకరించాలని తెలిజేసేదే ఉగాది పచ్చడి. ఈ షడ్రుచుల పచ్చడిని తినడం వెనుక జీవితసారం గోచరిస్తుంది. ఈ పచ్చడి మధురం, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు రుచులు మిళితమై ఉంటాయి.

అయితే ఈ ఆరు రుచులో ఆరు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేపపువ్వు చలవ చేస్తుంది. కొత్త బెల్లం ఆకలిని పెంచుతుంది. చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది. మిరియపు పొడి శరీరంలో క్రిముల్ని నాశనం చేస్తుంది. మామిడి శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉప్పు మన జీర్ణశక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది.