జగన్‌కు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..

మహిళలు, చిన్నారుల రక్షణతో పాటు బాధితులకు సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంపై కేంద్ర హోం శాఖ కసరత్తు చేపట్టింది. దిశ బిల్లుకు చట్ట రూపం కల్పించే చర్యలను కేంద్రం ప్రారంభించింది. కొన్ని సాంకేతిక అంశాలపై కేంద్ర హోం శాఖ కోరిన వివరాలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. ఈ నేపథ్యంలో బిల్లుకు చట్ట రూపం ఇచ్చే దిశగా కేంద్ర కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ నగర శివార్లలో మూడు నెలల క్రితం ‘దిశ’ అనే యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలు భగ్గుమన్నారు. జనాలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ‘దిశ’పై అఘాయిత్యానికి పాల్పడ్డ నలుగురు నిందితులు ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. ఆ సమయంలోనే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు, బాధితులకు సత్వర న్యాయం కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ‘దిశ’ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించారు. దీని చట్ట రూపం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు.