వరలక్ష్మీ వ్రతం పూజా సమయం

చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాదిలోని ఐదో నెల శ్రావణం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ పండగే. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం. అంతే కాదు ఈ మాసంలో మంగళవారం శ్రావణ గౌరీ వ్రతం, శుక్రవారం మహాలక్ష్మీ పూజలు ఎంతో ప్రత్యేకం. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తికి భార్య. శ్రీమహావిష్ణువు దేవేరి మహాలక్ష్మీ అష్టవిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ, ఎల్లవేళలా రక్షిస్తుంది.

అయితే ఈ పూజలు ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. అంతే కాదు పెళ్లి కాని కన్నె పిల్లలు కూడా మంచి భర్త, కుమారులు కలగాలని అమ్మవారిని కొలుస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా ఈ పూజలో పాలుపంచుకుంటారు.

ఈ ఏడాది జులై 31న రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకోవాలి. ఆరోజు శుక్రవారం ఉదయం 6.59 నుంచి 9.17 వరకు సింహలగ్నం, ఈ రెండు గంటల 18 నిమిషాలలో పూజ చేసుకోవచ్చని పండితులు తెలియజేశారు. ఒక వేళ అనుకోని పరిస్థితుల్లో ముహూర్తం దాటితే మళ్లీ మధ్యాహ్నం 1.53 నుంచి 4.11 మధ్య వృశ్చిక లగ్నం ముహూర్తం 2.18 గంటల వరకు పూజ చేసుకోవచ్చని పండితులు తెలిపారు. ఈ సమయం కూడా దాతిటే మళ్లీ రాత్రి 7.57 నుంచి 9.25 వరకు కుంభలగ్నం 1.28 నిమిషాలు, రాత్రి 12.25 నుంచి 2.21 వరకు వృషభలగ్నం ముహూర్తం 1.56 గంటలు వ్రతాన్ని చేసుకోవాలని సూచిస్తున్నారు.