వరలక్ష్మి వ్రతం రోజు ఎందుకు ఈ వ్రతం చేస్తారో తెలుసా

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మీ వ్రతంతో మనకు సర్వం ప్రాప్తిస్తాయి. శ్రీ (ధనం), భూ (భూమి), సరస్వతి (చదువు), ప్రీతి (ప్రేమ), కీర్తి, శాంతి, తుష్టి (సంతోషం), పుష్టి (బలం) కలుగుతాయి.

వరలక్ష్మీ వ్రతం రోజున అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజులు తెల్లవారుజామునే కుటుంబ సభ్యులందరూ నిద్రలేచి, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఆ తరువాత ఇంటి ఈశాన్య భాగంలో ఆవుపేడతో చక్కగా అలికి రంగుల ముగ్గులు పెట్టి, మండపాన్ని అందంగా ఏర్పాటుచేయాలి. ఆ తరువాత ఆ మండపంలో కొత్తబియ్యం పోసి అందంగా అలంకరించాలి. తరువాత కలశాన్ని ఉంచి, మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుళ్లను అందులో వేయాలి. కలశంపై నారికేళాన్ని పెట్టి ఎరుపు రంగు రవిక గుడ్డను దానికి అలంకరించాలి.

అందంగా అలంకరించిన మండపంలోని కలశం ముందు భాగంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ, చిత్రపటాన్ని కానీ ఉంచాలి. తొలుత పసుపుతో గణపతిని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీగా భావించి వాయనమీయవలెను.