ఏపీ ప్రజలకు అలర్ట్.

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఆ వయసుల వారికే కరోనా ఎక్కువట!

ఏపీలో కరోనా ఓవైపు పంజా విసురుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది. గత రెండు, మూడు రోజులుగా 200కిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే పరీక్షల సంఖ్య పెరగడంతో కేసులు కూడా బయటపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా రెడ్‌జోన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అక్కడ నిత్యావసరాలు, మందులు వంటివి వాలంటీర్ల సాయంతో ఇళ్లకు పంపిణీ చేస్తున్నారు. పోలీసులు జనాలను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఉదయం సమయంలో కూడా జనాల్ని బయటకు రానివ్వడం లేదు.

రాష్ట్రంలో కేసుల సంఖ్య అలా ఉంటే.. కరోనా పాజిటివ్ నిర్థారణ అయిన వాళ్లలో ఎక్కువమంది 16 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది.. ఈ మేరకు ఆరోగ్య ఆంధ్ర ఓ ట్వీట్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో.. 60శాతానికి పైగా యువత (16-45 వయసు వారు) ఉన్నారంటోంది. ఆ వయసుల వారు ఇంట్లోనే ఉండాలని.. తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కాబట్టి ఏపీ ప్రభుత్వ సూచనల మేరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి.