గోదావరికి పోటెత్తిన వరద

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వరద ఉధృతితో గురువారం రాత్రి 11 గంటలకు గోదావరి నీటిమట్టం 17.03 అడుగులు ఉండగా, శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు 18.90 అడుగులకు చేరింది. అది పెరుగుతూ రాత్రి 11 గంటలకు 33.10 అడుగులకు చేరింది. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి కూడా వరద నీరు ఉపనదుల ద్వారా గోదావరికి చేరడంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి మరింత పెరిగింది. అంతేకాకుండా ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి కూడా నీటిని దిగువకు వదులుతుండటంతో శనివారం మధ్యాహ్నానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు. అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశముంది. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. మరోవైపు, 1986లో వచ్చిన 75.6 అడుగుల నీటిమట్టంకన్నా పోలవరం బ్యాక్‌ వాటర్‌తో ఇప్పుడు భద్రాచలంలో గోదావరి ఒకట్రెండు అడుగులు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందన్న ప్రచారంతో ఏజెన్సీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.