ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 1.80 లక్షల కరోనా పాజిటివ్ కేసులు.

ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 1.80 లక్షల కరోనా పాజిటివ్ కేసులు.. ఇదో కొత్త రికార్డ్

కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. గతేడాది డిసెంబరులో వెలుగుచూసిన కరోనా వైరస్… మొత్తం ప్రపంచాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. రోజురోజుకీ మహమ్మారి మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 1.83 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కేవలం మూడు దేశాల్లోనే లక్షకుపైగా కేసులు నమోదయినట్టు పేర్కొంది. వీటిలో అత్యధికంగా బ్రెజిల్‌లో 54,771, అమెరికాలో 36,617, భారత్‌లో 15,413 కేసులు నమోదయ్యాయి.

కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచడం, లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడం వంటి కారణాల వల్లే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 90 లక్షల కేసులు నమోదయ్యాయి. వీరిలో 4.70 లక్షల మంది మృతిచెందారు. వీరిలో దాదాపు 9వేల మంది గడచిన 24 గంటల వ్యవధిలోనే మరణించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కొత్తగా నమోదైన మరణాల్లో మూడో వంతు అమెరికా ఖండాల్లోని దేశాల నుంచే నమోదైనట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 48 లక్షల మందికిపైగా కోలుకున్నారు. మరో 36 లక్షల మందికిపైగా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.