వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన జగన్‌

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను సిఎం వైఎస్‌ జగన్‌ తన క్యాంప్‌ ఆఫీసు నుంచి వర్చువల్‌ విధానంలో గురువారం ప్రారంభించారు. పక్కా ఇళ్ల నిర్మాణ పనుల్లో భాగంగా.. మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవారు ఎక్కడా ఉండకూడదని, పేదవారి సొంతిళ్లు కల నిజం చేస్తున్నామన్నారు. 175 నియోజకవర్గాల్లో మొదటి దశలో గృహ నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. తొలి విడతలో రూ.28,084 కోట్లతో 15.60 లక్షల పక్కాగృహాల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌ 22 నాటికి తొలి దశ గృహ నిర్మాణాల పనులు పూర్తి చేస్తామని సిఎం ప్రకటించారు. రెండో దశలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. రెండు దశలు కలిపి రూ.50,940 కోట్లతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. 17 వేల వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మిస్తున్నామని సిఎం జగన్‌ పేర్కొన్నారు.