వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న వైసీపీ ఎంపీ అక్కడ లోక్‌సభ స్పీకర్‌తో పాటు.. హోంశాఖ కార్యదర్శితో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను కూడా వైసీపీ ఎంపీ కలవనున్నట్లు సమాచారం. తనకు రక్షణ కల్పించాలని ఇప్పటికే స్పీకర్‌ను రఘురామ కృష్ణం రాజు కోరిన విషయం తెలిసిందే. వైసీపీ ఎంపీ ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో అధికార పార్టీ నేతలు ఆలోచనలో పడ్డారు.
తాజాగా ఏపీలో అధికార పార్టీ వైసీపీలో నరసాపురం ఎంపీ అయినా రఘురామకృష్ణంరాజు వ్యవహారం కలకలం రేపుతోంది. ఆయనకు పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీచేసింది. ఆయన పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం విషయంలో పార్టీ మేనిఫెస్టోకు భిన్నంగా వైసీపీ ఎంపీ పలు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అలాగే, వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఆయన ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు గుప్పించారని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో వుంటూ సొంత పార్టీని కించపర్చేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా సీఎం జగన్‌పై కూడా పలు వ్యాఖ్యలు చేశారని విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.