రెడ్ జోన్లలో ఉన్న ఆసుపత్రుల్లో కచ్చితమైన మెడికల్ ప్రొటోకాల్ పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్-19 నివారణ చర్యలపై ఆయన సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్‌లు హజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్షలు కొనసాగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 2,345 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ‘ఎంఫాన్’ తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు వస్తే సన్నద్ధంగా ఉండాలని ఆయన అధికారులను హెచ్చరించారు. తుపాను కదలికలను గమనించాలని, దీనిపై విద్యుత్తు, రెవిన్యూ, పౌరసరఫరాలు, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తుఫాను వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని, చేపల వేట నిషేధ సమయమే అయినా బోట్లలో ఏ ఒక్కరూ సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. తగినంత కార్యచరణతో పాటు అధికారులను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. అంతేగాక తుపానును దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలును కూడా వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ధాన్యం సేకరణలో అగ్రెసివ్‌గా ఉండాలని, కల్లాల్లో ఉన్న ధాన్యం వీలైనంతవరకూ కొనుగోలు చేయాలని చెప్పారు. వర్షాల వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉన్న పంటల సేకరణలో వేగం పెంచాలన్నారు.

ఎంఫాన్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలి