ఏపీకి ప్రత్యేక బలం ఉంది : సీఎం జగన్‌

హైదరాబాద్‌, బెంగళూరులాంటి నగరాలతో పోటీపడే సత్తా విశాఖకు మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. విశాఖలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం అత్యున్నతస్థాయి ఇంజినీరింగ్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మౌలిక సదుపాయాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బలం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని.. లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉందని సీఎం జగన్‌ గుర్తుచేశారు. గత ప్రభుత్వం రాయితీలను కూడా అమ్ముకుందని.. కానీ ఈ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. వ్యవస్థలో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా గురువారం పారిశ్రామిక రంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ అవకాశాల పెంపుపై సీఎం జగన్‌ చర్చించారు. పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విభజనతో మనకు నష్టమే జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తారని మాట ఇచ్చి ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే అనేక రాయితీలు ఇచ్చేవారు.. పరిశ్రమలు వచ్చేవి. జీఎస్టీతోపాటు అనేక పన్నుల్లో మినహాయింపులు వచ్చేవి. 2014-19 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాపురం చేసినా హోదా రాలేదు. కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ రాకపోయి ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం జరిగి ఉండేది. ప్రత్యేక హోదా ఇస్తే ఎవరితోనైనా కలిసిపోతామని ఆనాడే చెప్పాం. కానీ కేంద్రంలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పుడు అవకాశం వచ్చినా కేంద్రంతో ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉన్నాం. ఎప్పటికైనా ప్రత్యేక హోదాను సాధించి తీరుతాం. మనం చెప్పే మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలి. గత ప్రభుత్వం మాదిరిగా నేను అబద్ధాలు చెప్పను. గత ప్రభుత్వం రూ.20 వేల కోట్ల పెట్టుబడులు, 40 లక్షలు ఉద్యోగాలంటూ ప్రచారం చేసింది. అన్ని విదేశీ సంస్థలు వచ్చేస్తున్నాయని ప్రచారం చేశారు. గత ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ గ్రాఫిక్స్‌తో కాలం గడిపింది. గత ప్రభుత్వం రాయితీలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. 2014-19 వరకు రూ.4వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వం డిస్కంలకు రూ.20వేల కోట్ల బకాయిలు పెట్టింది.హైదరాబాద్‌, బెంగళూరులాంటి నగరాలతో పోటీపడే సత్తా విశాఖకు మాత్రమే ఉంది. విశాఖలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం అత్యున్నతస్థాయి ఇంజినీరింగ్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం. ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదంపై వేగంగా స్పందించాం. రూ.50 కోట్లు విడుదల చేసి బాధితులకు 10 రోజుల్లోనే ఇచ్చాం. సంఘటన జరిగిన గంటలోపే అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వ కమిటీలు విచారణ జరుపుతున్నాయి. కమిటీల నివేదిక తర్వాత బాధ్యులెవరైనా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.